విజయ్ పాలన 'పుష్ప' స్టైల్లో సాగుతోంది.. టీవీకేను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు: ఉదయనిధి

  • బలపరీక్ష రోజునే టీఎన్ అసెంబ్లీలో టీవీకే, డీఎంకే మధ్య మాటల యుద్ధం
  • రాష్ట్రానికి కావాల్సింది రియల్ ప్రభుత్వమే కానీ, రీల్ ప్రభుత్వం కాదన్న ఉదయనిధి
  • తప్పుడు హామీలతో విజయ్ గెలిచారని విమర్శ

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఉదయనిధి స్టాలిన్ చేసిన 'రీల్ వర్సెస్ రియల్' వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శనాస్త్రాలు సంధించారు. "తమిళనాడుకు కావాల్సింది రియల్ ప్రభుత్వమే కాని, సినిమాల్లో కనిపించే రీల్ ప్రభుత్వం కాదు" అంటూ విజయ్ సినీ నేపథ్యాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. టీవీకే పార్టీకి సొంతంగా మెజార్టీ లేదని... తమ డీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే విజయ్ ప్రభుత్వం గట్టెక్కగలిగిందని ఆయన గుర్తుచేశారు. 


విజయ్ పార్టీని రాష్ట్రంలోని 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారని, టీవీకేపై ప్రజలకు విశ్వాసం లేదనే విషయం ఎన్నికల్లోనే తేలిపోయిందని అన్నారు. టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదని గుర్తు చేశారు. తప్పుడు హామీలతో విజయ్ ఎన్నికల్లో గెలిచారని, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలపై ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. విజయ్ కు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. 'పుష్ప' సినిమా స్టైల్లో విజయ్ పాలన సాగుతోందని విమర్శించారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడి రాష్ట్ర ప్రతిష్టను విజయ్ దిగజార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను టీవీకే ప్రభుత్వం కొనసాగించాలని కోరారు.


విజయ్ ప్రభుత్వం అనైతిక మార్గాల్లో మద్దతు కూడగట్టుకుందని ఆరోపిస్తూ, బలపరీక్ష ఓటింగ్‌ను డీఎంకే బహిష్కరించింది. ఉదయనిధి నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, డీఎంకే వాకౌట్ చేసినప్పటికీ, 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడంలో సఫలమయ్యారు.


Udhayanidhi Stalin
Vijay TVK
Tamil Nadu Assembly
DMK
Tamil Nadu Politics
Assembly Elections
Udhayanidhi Stalin Comments
TVK Party
Pushpa Movie
Tamil Nadu Government

More Telugu News